ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, నిరుద్యోగుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, న్యాయవాది సిందం శ్రీకాంత్ ఆరోపించారు.
ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, ఇప్పుడు ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నించడం తీవ్రంగా ఖండనీయమని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, న్యాయవాది సిందం శ్రీకాంత్ పేర్కొన్నారు.
ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు కల్పిస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను పూర్తిగా విస్మరించిందని ఆయన విమర్శించారు. ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత తమ హక్కుల కోసం ప్రశ్నిస్తే, వారికి సమాధానం చెప్పకుండా పోలీసులు ద్వారా లాఠీ ఛార్జ్‌లు చేయించడం, అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం అత్యంత దుర్మార్గమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిరుద్యోగ యువతకు మద్దతుగా పోరాడుతున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడం, వారిని లక్ష్యంగా చేసుకుని వేధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఒకవైపు నిరుద్యోగులను, మరోవైపు ప్రజల సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్షాలను అణచివేయడం ప్రజా పాలన కాదని, ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని ఆయన అన్నారు.
ఇలాంటి విధానాలతో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో విశ్వాసం కోల్పోయే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించిన ఆయన, ప్రభుత్వం వెంటనే తన విధానాన్ని మార్చుకుని, ఈ దుర్మార్గపు చర్యలను నిలిపివేసి, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన వారిలో సిందం శ్రీకాంత్ తో పాటు పలువురు నాయకులు ఉన్నారని తెలిపారు.










