బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ గతంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో చేపట్టిన రైల్ రోకో కేసులో, టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవితకు సికింద్రాబాద్ రైల్వే కోర్టు సమన్లు జారీ చేసింది. రేపు (బుధవారం) ఉదయం 10.30 గంటలకు కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ గత 2025 నవంబర్ 28న కామారెడ్డి జిల్లా కేంద్రంలో కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) నాయకులు రైల్ రోకో చేపట్టారు. ఈ నేపథ్యంలో, రైల్వే చట్టం కింద కవితతో పాటు మరో 12 మంది నాయకులపై కేసులు నమోదయ్యాయి.
ఈ కేసు విచారణలో భాగంగా, కవితను సికింద్రాబాద్ లోని సెకండ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులో బుధవారం ఉదయం 10.30 గంటలకు హాజరు కావాలని కోర్టు సమన్లు జారీ చేసింది. తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన బీసీ బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాలని ఈ రైల్ రోకో సమయంలో డిమాండ్ చేశారు.
బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని కవిత తేల్చిచెప్పారు. రైల్ రోకో కారణంగా సిర్నపల్లి – ఇందల్వాయి రైల్వే స్టేషన్ల మధ్య దేవగిరి ఎక్స్ ప్రెస్ తో పాటు ఒక గూడ్స్ రైలు కూడా నిలిచిపోయినట్లు సమాచారం.
కవితతో పాటు రైల్ రోకోలో పాల్గొన్న మరో 12 మంది టీఆర్ఎస్ నాయకులపై కామారెడ్డి రైల్వే ఏఎస్ఐ రవీంద్ర బాబు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా, U/Sec.147 & 74(a) Railway Act కింద కవితతో సహా 12 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసుల విచారణ నేపథ్యంలోనే కోర్టు సమన్లు జారీ అయినట్లు తెలుస్తోంది.







