ప్రస్తుత రాజకీయాల్లో విలువలను పెంపొందించిన మార్క్సిస్టు నాయకుడు మద్ది కాయల ఓంకార్ ఆదర్శ రాజకీయాలు, చట్టసభల్లో ఆయన పాత్రపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) – ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో ఒక సభ నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి జబ్బర్ తెలిపారు. ఈ సభ మార్చి 17న జరగనుంది.
ఓంకార్ గారి శత జయంతి వార్షికోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పార్టీ నాయకులు వెల్లడించారు. ఈ సభకు అధికార, ప్రతిపక్ష, వామపక్ష పార్టీలతో పాటు వివిధ సామాజిక సంఘాల ముఖ్య నాయకులను ఆహ్వానించినట్లు తెలిపారు.
ఈరోజు పార్టీ కార్యాలయంలో జరిగిన ఎంసిపిఐ(యు) జిల్లా కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ నరసన్న అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జబ్బార్ మాట్లాడుతూ, ఓట్లు, సీట్లు, అధికారం సంపాదన ధ్యేయంగా రాజకీయ విలువలు దిగజారుతున్నాయని విమర్శించారు.
నీతి, నిజాయితీ, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జీవితాన్ని త్యాగం చేసిన ఓంకార్ గారి జీవిత చరిత్ర, ఆయన ఆదర్శ రాజకీయాలను స్మరించుకునేందుకు ఈ సభ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ సభను విజయవంతం చేయడానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
వర్గ, సామాజిక, ప్రజా ఉద్యమాలను బలోపేతం చేసి, ప్రత్యామ్నాయ రాజకీయాలను పెంపొందించడానికి ఓంకార్ అనుసరించిన పద్ధతులను ముందుకు తీసుకెళ్లాలని జబ్బార్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











