దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జూన్ 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. జూన్ 18న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుండటంతో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.
నామినేషన్ల దాఖలుకు జూన్ 8 చివరి తేదీ కాగా, జూన్ 9న నామినేషన్ల పరిశీలన, జూన్ 11న ఉపసంహరణకు గడువుగా ప్రకటించారు. ఎన్నికలు ముగిసిన రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, జూన్ 20 కల్లా ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని ఈసీ వెల్లడించింది.
ఏపీ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల నుంచి నాలుగు స్థానాల చొప్పున ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే ఈ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో కూటమి నేతలు ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక విషయంలో దాదాపు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
బీజేపీ, జనసేన పార్టీల నుంచి అభ్యర్థుల ఎంపికపై అనూహ్య నిర్ణయాలు జరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యే అభ్యర్థుల విషయంలో కసరత్తు జరుగుతోందని పార్టీ వర్గాలు తెలిపాయి. కూటమిలోని పార్టీలు తమ బలాబలాలకు అనుగుణంగా సీట్ల కేటాయింపుపై చర్చలు జరుపుతున్నాయని సమాచారం.











