సంగారెడ్డి, 2026-08-03
జిల్లాలో జరుగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా, విజయవంతంగా పూర్తి చేయడంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు క్రియాశీలకంగా సహకరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కోరారు. ఎన్నికల ప్రక్రియను మరింత పటిష్ఠంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల సూచనలు, సహకారం ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.

సోమవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో అడిషనల్ కలెక్టర్లు సంగీత, పాండుతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ ఎస్ఐఆర్ కార్యక్రమం పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ, డిజిటలైజేషన్ పురోగతి, ఓటరు జాబితా సవరణకు సంబంధించిన అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణ గడువును ఆగస్టు 10 వరకు పొడిగించిందని తెలిపారు. ఇప్పటివరకు ఫారాలు సమర్పించని అర్హులైన ఓటర్లు వెంటనే తమ బూత్ స్థాయి అధికారి (బీఎల్వో)కి లేదా సంబంధిత హెల్ప్‌డెస్క్‌లో ఫారాలు అందజేయాలని కోరారు.
సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు జిల్లాలో ఎస్ఐఆర్ కార్యక్రమం సజావుగా కొనసాగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. తమ పరిశీలనలో గుర్తించిన పలు అంశాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చి, కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు సంగీత, పాండు, ఈఆర్వోలు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.