తెలంగాణ అసెంబ్లీలో మైనింగ్ అంశంపై శుక్రవారం తీవ్ర వాడివేడి చర్చ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అక్రమ మైనింగ్‌పై, అనుమతులు లేని క్రషర్లపై అధికార పక్షాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి ప్రతిస్పందనగా మంత్రి శ్రీధర్ బాబు హరీశ్ రావు వ్యాఖ్యలను ఖండించారు.
మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, 'కంచె చేను మేసినట్లు... రక్షకుడే భక్షకుడిలా మారినట్లు' అక్రమ మైనింగ్ జరుగుతోందని విమర్శించారు. నగరం నడిబొడ్డున రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరుతో నడుస్తున్న క్రషర్లకు ఎలాంటి అనుమతులు లేవని, నిబంధనలు పాటించకుండా వాటిని నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని ఆయన అన్నారు.
మైనింగ్ శాఖ షోకాజ్ నోటీసులు, డిమాండ్ నోటీసులు జారీ చేసినా చర్యలు తీసుకోలేదని, అనుమతులు లేని క్రషర్‌ను మూసివేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు మైనింగ్ శాఖ లేఖ రాసినా ఫలితం లేదని హరీశ్ రావు తెలిపారు. ఒక క్రషర్ కంపెనీ వల్ల కాలుష్యం పెరుగుతోందని తాను ట్వీట్ చేస్తే, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ స్పందించారని, అయితే మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాతే విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
అక్రమ మైనింగ్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని, లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని హరీశ్ రావు పట్టుబట్టారు. గతంలో ఓబుళాపురం మైన్స్పై జరిగిన చర్చను ప్రస్తావిస్తూ, అప్పుడు హౌస్ కమిటీ వేసి, ఆరోపణలు చేసిన నాగం జనార్ధన్ రెడ్డినే కమిటీకి అధిపతిగా నియమించారని గుర్తు చేశారు.
మంత్రి శ్రీధర్ బాబు హరీశ్ రావు వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తూ, ఆయన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విచారణ కోరితే జరిపిస్తామని చెప్పామని, అయినప్పటికీ మంత్రి పేరును ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. మంత్రి రాజీనామా చేయాలనే వాదనను ఆయన ఖండించారు. హరీశ్ రావు చేసిన ఆరోపణలు అడ్డగోలుగా ఉన్నాయని, అవి రికార్డుల నుంచి తొలగించాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు.











