రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ఆర్మూర్, ఆలూరు మండలాల్లోని ఇటుక బట్టీలలో పనిచేస్తున్న కార్మికులకు విముక్తి కల్పించింది. కార్మికులను బంధించి బలవంతంగా పనులు చేయిస్తున్నారనే ఫిర్యాదులపై స్పందించి, ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
దేగం, మగ్గిడి గ్రామాల్లోని ఇటుక బట్టీలలో కార్మికుల దుర్భర పరిస్థితులను జిల్లా న్యాయమూర్తి భరత లక్ష్మి స్వయంగా పరిశీలించారు. కార్మికులను ఒక్కొక్కరిగా పిలిపించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోజువారీగా పని చేయని వారిని గదుల్లో బంధించి, మహిళలను శారీరకంగా హింసిస్తున్నారని కార్మికులు న్యాయమూర్తికి తెలిపారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, తెల్లవారుజామున 3 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు పనిచేయించుకుంటూ, కనీస వసతులు, వేతనాలు కల్పించకుండా కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న ఇటుక బట్టీ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
1000 మందికి పైగా కార్మికులను సురక్షితంగా తరలించి, వారికి ఆశ్రయం, అవసరమైన సదుపాయాలు, నష్టపరిహారం అందించాలని న్యాయమూర్తి హామీ ఇచ్చారు. వారిని సొంత గ్రామాలకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. చట్టవిరుద్ధంగా నడుస్తున్న ఇటుక బట్టీలను సీజ్ చేయాలని తహశీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు.











