సంగారెడ్డి జిల్లాలో మహిళలు స్వయం ఉపాధి మార్గాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. బేటి బచావో – బేటి పడావో (BBBP) పథకం కింద మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో 50 మంది లబ్ధిదారులకు కుట్టు యంత్రాల పంపిణీ, 25 మందికి బ్యూటీషియన్ శిక్షణ తరగతులను ఆమె, జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ, మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన, ఒంటరి, వితంతువులైన మహిళలు, చదువు మధ్యలో ఆపేసిన యువతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని సూచించారు. మహిళలు అన్ని రంగాల్లో పురోగతి సాధించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె హామీ ఇచ్చారు.
జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ, బేటి బచావో – బేటి పడావో పథకం కేవలం బాలికల రక్షణకే పరిమితం కాకుండా, మహిళల సాధికారతను పెంపొందించేలా అమలు అవుతోందని చెప్పారు. ఈ పథకం ద్వారా అందిస్తున్న కుట్టు యంత్రాలు, బ్యూటీషియన్ శిక్షణ వంటి కార్యక్రమాలు మహిళల జీవనోపాధిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆమె పేర్కొన్నారు.
జిల్లా సంక్షేమ అధికారిణి లలితా కుమారి, మున్సిపల్ చైర్పర్సన్ వనిత సంతోష్ కూడా మహిళా సంక్షేమ పథకాల ప్రాముఖ్యతను వివరించారు. మహిళలు శిక్షణతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని, స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలని వారు సూచించారు. అనంతరం, పర్యావరణ పరిరక్షణ స్ఫూర్తిగా మొక్కలు నాటారు.








