మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఇంధన సరఫరాపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ మను చౌదరి స్పష్టం చేశారు. తూంకుంటలోని పెట్రోల్ బంకులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, నిల్వల పరిస్థితిని సమీక్షించారు.
జిల్లాకు ఆయిల్ డిపోల నుంచి నిరంతరాయంగా ఇంధన సరఫరా కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న తప్పుడు వార్తలను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. పెట్రోల్ బంకుల వద్ద అనవసరంగా బారులు తీరడం, అవసరానికి మించి ఇంధనాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశముందని హెచ్చరించారు.
ప్రజలు తమ నిత్య అవసరాలకు సరిపడా మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని, సరఫరా వ్యవస్థపై పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కొనసాగుతోందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ఏ ఒక్క పెట్రోల్ బంకు కూడా 'డ్రై' కాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు, ఆయిల్ కంపెనీ ప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు.
పెట్రోల్ బంకు యజమానులు ముందస్తుగా ఆయిల్ కంపెనీలకు ఇండెంట్ పంపించాలని, ఇండెంట్ అందిన వెంటనే సరఫరా జరిగేలా ఆయిల్ కంపెనీలు చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా యంత్రాంగం ఇంధన సరఫరా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ తెలిపారు.











