చేతివృత్తుల వారికి చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అమలులో తీవ్ర జాప్యం జరుగుతోందని, అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనాలు అందడం లేదని అఖిల భారతీయ విశ్వకర్మ తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ శ్రీరామ్ మహిపాల్ చారి ఆరోపించారు. పథకం కింద టూల్ కిట్లు, బ్యాంకు రుణాలు అందడం లేదని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం మూడు సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ పథకంపై విశ్వకర్మలు ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ, ఆశించిన లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైందని మహిపాల్ చారి తెలిపారు. చాలా మంది లబ్ధిదారులకు టూల్ కిట్లు కూడా అందలేదని, ఒకవేళ టూల్ కిట్లు అందిన వారికి కూడా బ్యాంకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంక్ అధికారులు సహకరించడం లేదని, అనేక సందర్భాల్లో రుణాలను తిరస్కరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పథకాలు కూడా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నాయని ఆయన అన్నారు. ఈ పథకం అమలులో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని, అర్హులైన విశ్వకర్మలకు టూల్ కిట్లు, బ్యాంకు రుణాలు సకాలంలో అందేలా చూడాలని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. పథకం సక్రమంగా అమలు కావాలని, అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరగాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వేల్పూర్ విశ్వకర్మ మండల అధ్యక్షుడు నూనె గంగాధర్ చారి, సుంకం విష్ణు చారి, ముట్టుకు నారాయణ చారి, శ్రీరాం ప్రశాంత్, ముట్టుకు నాగేంద్ర చారి, చరణ్ చారి తదితరులు పాల్గొన్నారు. అధికారుల నిర్లక్ష్యం, బ్యాంకుల సహకారం లేకపోవడం వంటి కారణాల వల్ల విశ్వకర్మలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ సమస్యలను పరిష్కరించాలని సంఘం తరపున విజ్ఞప్తి చేశారు.











