గత ఏడాది ఉగాది కానుకగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన పేదలకు సన్న బియ్యం పంపిణీ పథకం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా, అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎన్.టి.ఆర్ నగర్ కాలనీలో నివసిస్తున్న వికలాంగుడు వి.శ్రీనివాస్ కుటుంబ సభ్యులు మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ను ఆహ్వానించి, సన్న బియ్యంతో వండిన భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ, సన్న బియ్యం పంపిణీతో ముఖ్యమంత్రి తెలంగాణ పేదల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారని అన్నారు.
గత ఏడాది నుండి రేషన్ దుకాణాల ద్వారా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ నిరంతరాయంగా జరుగుతోందని, రేషన్ కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారునికి ఒక్కొక్కరికి ఆరు కేజీల చొప్పున సన్న బియ్యం అందించడం కాంగ్రెస్ ప్రభుత్వ ఘనత అని ఆయన తెలిపారు.
అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ పేదలకు నాణ్యమైన బియ్యం అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని, పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెంకటేష్ గౌడ్ స్పష్టం చేశారు.
తమ ఇంటికి ఆహ్వానించి, సన్న బియ్యంతో భోజనం వడ్డించిన శ్రీనివాస్, మాధవి దంపతులను వెంకటేష్ గౌడ్ శాలువాతో సన్మానించి గౌరవించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.











