ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో వరుసగా మూడోసారి ఓవరాల్ ఛాంపియన్ ట్రోఫీని గెలుచుకుని హ్యాట్రిక్ సాధించిన తెలంగాణ పోలీసులను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ విజయం రాష్ట్ర పోలీసుల నిరంతర కృషి, క్రమశిక్షణకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ సీఐడీ పర్యవేక్షణలో జరిగిన నిరంతర శిక్షణ ఈ విజయానికి కారణమని, జాతీయ స్థాయిలో మరోసారి ప్రతిభ చాటిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు డీజీపీ బి. శివధర్ రెడ్డి, సీఐడీ అదనపు డీజీ చారు సిన్హా గార్లను అభినందించారు.
తెలంగాణ పోలీసుల విజయ పరంపర గత మూడు సంవత్సరాలుగా కొనసాగుతోంది. 2024లో లక్నో (ఉత్తరప్రదేశ్), 2025లో రాంచీ (జార్ఖండ్)లో జరిగిన పోటీలతో పాటు తాజాగా 2026లో నాగ్‌పూర్ (మహారాష్ట్ర)లో జరిగిన 69వ అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్లో విజయం సాధించి తెలంగాణ ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచింది.
ఈసారి నాగ్‌పూర్‌లో జరిగిన డ్యూటీ మీట్లో తెలంగాణ ప్రతినిధి బృందం అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఓవరాల్ ఛాంపియన్ ట్రోఫీతో పాటు యాంటీ-సాబోటేజ్ చెక్, వీడియోగ్రఫీ, కంప్యూటర్ అవేర్నెస్ విభాగాల్లో విజేతగా నిలిచింది. శాస్త్రీయ దర్యాప్తు సహాయాలు, పోలీస్ ఫోటోగ్రఫీ విభాగాల్లో రన్నరప్‌గా నిలిచింది.










