ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో, రిజిస్ట్రేషన్ల రద్దీని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పనివేళలను పొడిగించింది.
మార్చి 31తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆస్తి రిజిస్ట్రేషన్ల కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయని, ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మార్చి 28, 30, 31 తేదీలలో ఉదయం 9:30 నుండి రాత్రి 8:30 గంటల వరకు పనిచేయనున్నాయి. ఈ అదనపు పనివేళలు ప్రజలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవడానికి సహయపడతాయి.
ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు, కార్యాలయాల్లో స్లాట్ల సంఖ్యను పెంచాలని, అలాగే సెలవు దినాలలో కూడా పనిచేయాలని సిబ్బందికి సూచనలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఆర్థిక సంవత్సరం చివరిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో జాప్యం జరగకుండా, పౌరుల అవసరాలను తీర్చడానికి ఈ చర్యలు ఉపకరిస్తాయని భావిస్తున్నారు.











