అర్హులైన ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యమని టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డిలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
సంగారెడ్డి పీఎస్ఆర్ గార్డెన్ లో నిర్వహించిన ఈ సమావేశంలో, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, 500 రూపాయలకే గ్యాస్ కలెక్షన్ వంటి పథకాలను అమలు చేసిందని నిర్మలా జగ్గారెడ్డి తెలిపారు. అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డులను మంజూరు చేశామని, మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును ప్రజలకు వివరించేందుకు 99 రోజుల పాటు ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్మలా జగ్గారెడ్డి వివరించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులకు 195.18 కోట్ల విలువైన బ్యాంకు రుణాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో డీఆర్ డీవో పీడీ జ్యోతి, ఆర్డిఓ రాజేందర్, సంగారెడ్డి, సదాశివపేట మున్సిపల్ చైర్మన్లు కూన వనిత, అంజమ్మ, మున్సిపల్ కౌన్సిలర్లు, సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రనాయక్, మున్సిపల్ కమిషనర్లు శ్రీనివాస్ రెడ్డి, శివాజీ, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.












