ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు, కూలీల సంఖ్యను పెంచి ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ నుండి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాని కిషోర్, సెర్ప్ సీఈవో దివ్య నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కాన్ఫరెన్స్లో ఎన్ఆర్ఇజీఎస్, మహిళా స్వయం సహాయక సంఘాలు, చేయూత పథకం, నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం (ఎన్ఎఫ్బీఎస్) వంటి అంశాలపై చర్చించారు.
ఉపాధి హామీ పనులు వేగవంతం కావడానికి అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని, కొత్త జాబ్ కార్డులను మంజూరు చేయడంతో పాటు, కూలీలు పూర్తి పని దినాలను సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం, చేయూత పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
దివ్యాంగులకు దేశవ్యాప్తంగా ఒకే విధమైన గుర్తింపు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూడీఐడీ (యూనిక్ డిసేబిలిటీ ఐడెంటిటీ) కార్డులను అర్హులైన ప్రతి ఒక్కరూ పొందేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, మహిళా స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు.
వేసవి తీవ్రత దృష్ట్యా, ఉపాధి హామీ కూలీలు ఉదయం 7 గంటలలోపు పని ప్రదేశాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు. గ్రామపంచాయతీ, అంగన్వాడీ భవనాలు, మహిళా సంఘాల భవనాలు, పాఠశాలల మరుగుదొడ్లు, కాంపౌండ్ వాల్స్ వంటి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.












