కామారెడ్డి, జూలై 13
బిక్నూర్ మండల కేంద్రంలో అక్రమ నిర్మాణాలపై ‘ప్రజావాణి’లో ఫిర్యాదు చేసినా పంచాయతీ అధికారులు నామమాత్రపు చర్యలతో చేతులు దులుపుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కోర్టు పరిధిలో ఉన్న స్థలంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు, బోరు బావులు తవ్వడంపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బాధితులు జిల్లా కలెక్టర్కు విన్నవించారు.
మండల కేంద్రమైన బిక్నూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమ నిర్మాణాల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. గతంలో జాతీయ రహదారి పక్కన సర్వే నంబర్ 1017లో ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన ఒక పెద్ద షెడ్డు నిర్మాణంపై బాధితులు జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ‘ప్రజావాణి’లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై స్పందించిన గ్రామ పంచాయతీ అధికారులు ఇటీవల క్షేత్రస్థాయికి వెళ్లి ఉక్కుపాదం మోపుతామంటూ హడావుడి చేశారు. అయితే, అధికారులు సదరు అక్రమ నిర్మాణాన్ని పూర్తిగా తొలగించకుండా, కేవలం నామమాత్రంగా కొద్ది భాగాన్ని మాత్రమే తొలగించి చేతులు దులుపుకున్నారని బాధితులు మళ్లీ ప్రజావాణి బాట పట్టారు.
వివాదాస్పదంగా ఉన్న సదరు స్థలం ప్రస్తుతం కోర్టు పరిధిలో (న్యాయస్థానంలో కేసు నడుస్తోంది) ఉందని, అయినప్పటికీ అక్రమార్కులు కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ అక్కడ నిర్మాణాలు చేపట్టడమే కాకుండా, యథేచ్ఛగా బోరు బావిని కూడా తవ్వారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస అనుమతులు లేకుండా, కోర్టు వివాదంలో ఉన్న భూమిలో బోరు బావి వేయడం స్పష్టంగా ‘వాల్టా’ (WALTA) చట్టాన్ని పూర్తిగా అతిక్రమించడమేనని వారు వాపోతున్నారు.
ఈ అక్రమ వ్యవహారంపై గ్రామ పంచాయతీ అధికారులకు, మండల స్థాయి ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు లిఖితపూర్వకంగా విన్నవించినా, వారు సరైన చర్యలు తీసుకోవడం లేదని బాధితులు మండిపడుతున్నారు. అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి పూర్తి విచారణ జరపకుండా, అక్రమార్కులకు పరోక్షంగా కొమ్ముకాస్తున్నారని, అందుకే అక్రమ కట్టడాన్ని పూర్తిగా తొలగించకుండా వదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, సర్వే నంబర్ 1017లో జరుగుతున్న అక్రమ కట్టడాలు, నిబంధనలకు విరుద్ధంగా వేసిన బోరు బావిపై సమగ్ర విచారణ జరిపించాలని, వాల్టా చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై మరియు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.











