పటాన్చెరు, జూలై 25
ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇంటి నంబర్ల అస్పష్టత, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వంటి పలు మౌలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నవభారత్ నిర్మాణ్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ మున్సిపల్ కమిషనర్‌ను కోరారు. మున్సిపాలిటీని పరిశుభ్రమైన, హరిత, ఆధునిక ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశారు.
ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు మౌలిక సమస్యలను తక్షణమే పరిష్కరించి, మున్సిపాలిటీని పరిశుభ్రమైన, హరిత, ఆధునిక మరియు ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని నవభారత్ నిర్మాణ్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ మున్సిపల్ కమిషనర్‌ను కోరారు.
మున్సిపాలిటీ పరిధిలో అనేక ప్రాంతాల్లో ఇంటి నంబర్ల కేటాయింపులో అస్పష్టత, పునరావృత నంబర్లు, నంబర్లు లేకపోవడం వంటి సమస్యల వల్ల ప్రజలు ఆస్తి పన్ను చెల్లింపులు, విద్యుత్, తాగునీటి కనెక్షన్లు, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు ఇతర అధికారిక సేవలను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రత్యేక సర్వే నిర్వహించి ఇంటి నంబర్ల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు.
ఇస్నాపూర్ మున్సిపాలిటీని పరిశుభ్రమైన, హరిత మరియు ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రతి వార్డులో క్రమబద్ధమైన చెత్త సేకరణ, మొక్కల పెంపకం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగ నియంత్రణతో పాటు ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
మున్సిపాలిటీ పరిధిలోని అనేక కాలనీల్లో అంతర్గత సీసీ రోడ్లు, సమగ్ర డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల ముఖ్యంగా వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అవసరమైన ప్రాంతాల్లో నాణ్యమైన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని కోరారు.
ఇస్నాపూర్ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని మెట్టు శ్రీధర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.












