నిజామాబాద్, 2026-07-13
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టులకు తగిన గుర్తింపు, సంక్షేమం లభించడం లేదని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) ఆవేదన వ్యక్తం చేసింది. వారి దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేసింది.
జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, జిల్లా, మండల కేంద్రాల్లో అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) డిమాండ్ చేసింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన నిర్వహించి, అనంతరం అడిషనల్ కలెక్టర్ భుజంగరావుకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టులకు తగిన గుర్తింపు, సంక్షేమం లభించడం లేదన్నారు. ఎండనక, వాననక ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అర్హులైన ప్రతి జర్నలిస్టుకూ అక్రిడిటేషన్ కార్డులను వెంటనే జారీ చేయాలని, అక్రిడిటేషన్ కమిటీల్లో అన్ని జర్నలిస్టు సంఘాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా హెల్త్ కార్డులు అందించాలని, వాటికి సంబంధించిన ప్రీమియంను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని, జిల్లా, మండల కేంద్రాల్లో స్థలాలు కేటాయించాలని కోరారు. అలాగే జర్నలిస్టుల రైల్వే పాస్ సౌకర్యాన్ని పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, జిల్లా కార్యదర్శి రాంచందర్, జిల్లా నాయకులు మధు, అనిత, ప్రవీణ్, అఖిల్, రాజు, కృష్ణ, రాజేందర్, శ్రీకాంత్ గౌడ్, సురేష్, లక్ష్మణ్, ఆనంద్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.












