Site icon PRASHNA AYUDHAM

ఇప్పటికీ.. ఎప్పటికీ..నిర్మల్ పోలీస్.. మీ పోలీస్-ఎస్పీ జానకి షర్మిల

*ఇప్పటికీ.. ఎప్పటికీ..నిర్మల్ పోలీస్.. మీ పోలీస్-ఎస్పీ జానకి షర్మిల*

మంత్రి సీతక్క చొరవతో సమస్య పరిష్కారం.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం సంతోషం..

 ఎంత పెద్ద సమస్య అయినా సంయమనం పాటిస్తే పరిష్కరించుకోవచ్చని, ఆవేశాలకు పోతే నష్టం తప్ప ఎలాంటి లాభం ఉండదని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీషర్మిల పేర్కొన్నారు. దిలావర్పూర్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించడం, రైతులు ప్రజలకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేయడం హర్షనీయమని తెలిపారు. ఈ సమస్య పరిష్కరించడం లో జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క చాలా చొరవ తీసుకోవటం వల్ల సమస్యకు పరిష్కారం లభించింది. బాధిత రైతులు, యువకులు, మహిళలు, గ్రామస్తులు విద్రోహకారులకు అవకాశం ఇవ్వకుండా, ఎప్పుడు కూడా తమ సమస్యను సానుకూలంగా పరిష్కరించుకునేందుకే మొగ్గు చూపాలని సూచించారు. దిలావర్ పూర్ ఘటనలో పోలీసు శాఖ పూర్తి సంయమనం పాటించిందని స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి తన వాహనంలోనే ఘెరావ్ చేయడంతో ఆర్డీవో రత్న కళ్యాణి అస్వస్థతకు గురయ్యారని, ఈ నేపథ్యంలోనే రోప్ పార్టీతో వెళ్లి, ఆర్డీవోను బయటకు తీసుకొచ్చి ఆసుపత్రికి పంపించామని వివరించారు. ఈక్రమంలో కొంతమంది ఆర్డీవో వాహనాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని, వారి ప్రయత్నాన్ని నిలువరించామని చెప్పారు. మంగళవారం ఉదయం నుంచి పోలీసు శాఖ అప్రమత్తంగా వ్యవహరించిందని చెప్పారు. 61వ జాతీయ రహదారిపై రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా సిర్గాపూర్, నర్సాపూర్, కల్లూరు తదితర చోట్ల ట్రాఫిక్ మళ్లింపులను చేపట్టామన్నారు. బుధవారం కూడా పోలీసు శాఖ శాంతియుతంగా వ్యవహరించిందన్నారు. పరిస్థితులు చేయి దాటి పోకుండా ఉండేందుకే కొంతమందిని అదుపులోకి తీసుకున్నామన్నారు.

గ్రామస్తులు పోలీసులపై రాళ్లు విసిరినప్పటికీ లాఠీచార్జి చేయకుండా.. శాంతియుతంగానే సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్లామని స్పష్టం చేశారు. దిలావర్పూర్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి, రైతులు, సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఫ్యాక్టరీ పనులను ఆపివేస్తామని ప్రకటించడం హర్షనీయమని ఎస్పీ జానకీషర్మిల పేర్కొన్నారు.

ఇప్పటికైనా ఆయా గ్రామాల ప్రజలు సంయమనం పాటించి, శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని ఆమె కోరారు.

ప్రస్తుతం పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నది కాబట్టి ఎవరూ ఏ రకమైన అసత్య వదంతులను నమ్మి చట్ట వ్యతిరేక చర్యలు చేయవద్దని ఎస్పి జానకి షర్మిల గ్రామస్తులకు విన్నవించారు.

Exit mobile version