సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 7 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి తారా ప్రభుత్వ కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగాలు, సామాజిక శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవ సంస్థ సహకారంతో న్యాయ సంబంధ విషయాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.ఎస్.ఎస్.రత్న ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవ సంస్థ సెక్రటరీ బి.రమేష్ మాట్లాడుతూ.. న్యాయ సంబంధ విషయాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని, పేదలు, పిల్లలకు, మహిళలకు, ఖైదీలకు ఉచితంగా ప్రభుత్వం తరఫున ఎటువంటి సమస్యల పై న్యాయ సహాయాన్ని అందించడం జరుగుతుందని, ప్రజలు దానిని వినియోగించుకోవాలని అన్నారు. కోర్టులో కేసు విచారణ ఏ విధంగా జరుగుతుందో విద్యార్థులకు ప్రయోగపూర్వకంగా వివరించారు. ఉచిత న్యాయ సేవలను పొందడానికి టోల్ ఫ్రీ నెంబర్ 15100 ను సంప్రదించాలని తెలిపారు. అదే విధంగా ఫోక్సో చట్టం లోని అంశాలను, ఆ చట్టం ద్వారా విధించబడే శిక్షలను వివరిస్తూ మైనర్ బాలికలపై జాగ్రత్తగా ఉండాలని వారిని తమ సొంతవారీగా పరిగణించాలని, వారిని లైంగికంగా గాని ఇతర ఏ విధంగా గాని వేధిస్తే అది ఫోక్సో చట్టం కింద వస్తుందని, అటువంటి వారికి కఠినమైన శిక్షలను అమలు చేయడం జరుగుతుందని, కావున మైనర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. సైబర్ నేరాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ప్రజలు తమ ఫోన్లకు వచ్చే అపరిచిత కాల్స్ కు సమాధానమివ్వరాదని, ఎటువంటి లింకులను ప్రెస్ చేయరాదని, సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఉచితంగా న్యాయ సహాయాన్ని అందించుటకు జిల్లా న్యాయ సేవా సంస్థ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. అనంతరం జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కళాశాలలో హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జగదీశ్వర్, ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ సదయ కుమార్, డాక్టర్ జోత్స్న, డాక్టర్ సుమతి, డాక్టర్ మిథున్, డాక్టర్ వాణి, అధ్యాపకులు డాక్టర్ అనురాధ, డాక్టర్ వాణి, ఇతర అధ్యాపక బృందం, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు న్యాయ విషయాలపై అవగాహన కలిగి ఉండాలి
Published On: November 7, 2024 4:15 pm