సంగారెడ్డి, జూలై 17
ప్రస్తుత వర్షాభావం, తేమ కొరత పరిస్థితుల నేపథ్యంలో రైతులు తమ పంటలను రక్షించుకోవడానికి శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను తప్పనిసరిగా పాటించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ సూచించారు. తేమ నిల్వ ఉండేలా కలుపు మొక్కలను తొలగించి, మల్చింగ్ పద్ధతిని పాటించాలని, అవసరమైతే రక్షణాత్మక నీటిపారుదల ద్వారా పంటలను కాపాడుకోవాలని ఆయన సూచనలు చేశారు.
జిల్లాలో ప్రస్తుత వర్షాభావం, తేమ కొరత (Moisture Stress) పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటలను రక్షించుకోవడానికి శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను తప్పనిసరిగా పాటించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ సూచించారు.
వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు అందిస్తున్నారని ఆయన తెలిపారు. తేమ నిల్వ ఉండేలా పొలాల్లో కలుపు మొక్కలను తొలగించి, మల్చింగ్ పద్ధతిని అమలు చేయాలని సూచించారు. వరి, మొక్కజొన్న, పత్తి తదితర పంటల్లో ఎండిన గడ్డి, పంట అవశేషాలను మొక్కల మధ్య పరచడం ద్వారా నేలలో తేమ ఎక్కువకాలం నిల్వ ఉంటుందని, నీటి ఆవిరీకరణ తగ్గుతుందని వివరించారు.
అవకాశం ఉన్న రైతులు రక్షణాత్మక నీటిపారుదల (Life-saving Irrigation) ద్వారా తక్కువ మొత్తంలో నీటిని అందించి పంటలను ఎండబారకుండా కాపాడాలని తెలిపారు. అలాగే వరుసల మధ్య నేలను పలుచగా దున్నే అంతరకృషి చేయడం వల్ల నేల గట్టిపడకుండా ఉండి తేమ నిల్వకు ఉపయోగపడుతుందని చెప్పారు.
నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో రైతులు పరిస్థితులకు అనుగుణంగా జొన్న, సజ్జ, రాగులు, పెసలు, మినుములు, కంది, వేరుశనగ వంటి తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని కోరారు. అలాగే పశువులకు పచ్చిమేత కొరత ఏర్పడకుండా పంట అవశేషాలు, పచ్చిమేతను సంరక్షించి నిల్వ ఉంచాలని రైతులకు సూచించారు.
పంటలకు సంబంధించి రైతులకు వ్యవసాయ శాఖ అన్ని విధాలా సాంకేతిక సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.












