నిజామాబాద్, జూలై 8
బోధన్ డివిజన్లో రాబోయే పండుగల నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తుతో పాటు నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. బుధవారం బోధన్ రూరల్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో పెండింగ్ కేసుల పురోగతిని పరిశీలించి పలు కీలక సూచనలు చేశారు.
రాబోయే పండుగల నేపథ్యంలో బోధన్ డివిజన్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లతో పాటు నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం బోధన్ రూరల్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో డివిజన్ పరిధిలోని పెండింగ్ కేసుల పురోగతిని పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
హత్యలు, హత్యాయత్నాలు, చోరీలు, మహిళలపై నేరాలు, సైబర్ మోసాలు, డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా, పేకాట, గుట్కా వ్యాపారాలకు సంబంధించిన కేసులను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. రౌడీషీటర్లు, పాత నేరస్థులు, బెయిల్‌పై విడుదలైన వారిపై నిరంతర నిఘా కొనసాగించాలని, రాత్రి పహారా, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల తనిఖీలను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు.
మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో అంతర్రాష్ట్ర నిఘాను బలోపేతం చేసి అక్కడి పోలీసులతో సమన్వయం పెంచుకోవాలని సూచించారు. మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ షీ టీమ్స్, ఈగల్ టీమ్స్, చీతా ఫోర్స్ మరింత సమర్థంగా పనిచేయాలని చెప్పారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
డ్రగ్స్, గంజాయి, పేకాట, గుట్కా, ఇసుక అక్రమ రవాణాపై నిరంతర దాడులు నిర్వహించి అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయాలని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్లలో ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని, సీసీ కెమెరాల వినియోగాన్ని విస్తరించి సాంకేతికతతో నేరాల నియంత్రణ చేపట్టాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్స్పాట్లను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, లింకు రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలని, రోడ్డు పక్కనున్న పొదలను తొలగించాలని సంబంధిత శాఖలతో సమన్వయం చేయాలని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్‌స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్లు వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి ప్రజల్లో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించాలని కమిషనర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో బోధన్ ఏసీపీ పి. శ్రీనివాస్, సీసీఆర్బీ ఏసీపీ గురునాయుడు, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ ఆర్. అంజయ్యతో పాటు బోధన్ డివిజన్‌కు చెందిన సీఐలు, ఎస్‌హెచ్‌వోలు, ఎస్ఐలు, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.











