జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ అధ్యక్షతన నెలవారీ క్రైమ్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేరాల నివారణతో పాటు జరిగిన నేరాలను త్వరితగతిన ఛేదించి బాధితులకు న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ మాట్లాడుతూ, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. గత నెలలో నమోదైన కేసులపై సమగ్రంగా చర్చించి, పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా పోక్సో, గ్రేవ్, నాన్-గ్రేవ్, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, చార్జ్షీట్లను సకాలంలో దాఖలు చేయాలని సూచించారు.
మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, వారికి నాణ్యమైన సేవలు అందించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని ఎస్పీ నొక్కి చెప్పారు. నేరస్తుల కదలికలపై నిఘా పెంచాలని, గంజాయి సరఫరా మార్గాలను గుర్తించి, రవాణాను అరికట్టాలని ఆదేశించారు. వేసవిలో దొంగతనాల నివారణకు పగలు, రాత్రి పెట్రోలింగ్‌ను మరింత పటిష్టంగా నిర్వహించాలని సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” లో భాగంగా పోలీస్ శాఖ నిర్వహిస్తున్న “Arrive Alive” కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయాలని ఎస్పీ సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారం, సైబర్ నేరాలపై అవగాహన, రోడ్డు భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.
రానున్న బక్రీద్, హనుమాన్ జయంతి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించడానికి అవసరమైన పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేశారు.











