సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిలిపివేసి, పర్యావరణ పరిరక్షణలో యువత క్రియాశీలకంగా వ్యవహరించాలని వక్తలు సూచించారు. గుమ్మడిదల మండలంలోని మిలీనియం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఈ పిలుపునిచ్చారు.
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, సంగారెడ్డి ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో “ప్లాస్టిక్ అలవాటును విడనాడండి – సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు నో చెప్పండి” అనే అంశంపై ఈ అవగాహన కార్యక్రమం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక”లో భాగంగా నిర్వహించబడింది.
అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పి.శిరీష మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య తీవ్రతను, భారతదేశంలో అమలులో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నియమాలు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ (EPR) విధానాల ప్రాముఖ్యతను వివరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి, జీవవైవిధ్యానికి కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
కళాశాల ప్రతినిధి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో చురుకైన పాత్ర పోషించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుమారు 60 మంది విద్యార్థులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, సిబ్బంది, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్లాస్టిక్ రహిత జీవన విధానాన్ని అవలంబించడానికి సంకల్పించారు.












