సంగారెడ్డి, జూలై 15
సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పటాన్ చెరు, జహీరాబాద్ ప్రాంతాల్లో నూతనంగా నిర్మించిన ఆస్పత్రి భవనాలను ప్రారంభించాలని, సంగారెడ్డి ఆసుపత్రిలో ఎంఆర్ఐ (MRI) ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రులలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ పాండుకు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పటాన్ చెరు, జహీరాబాద్ ప్రాంతాల్లో నూతనంగా నిర్మితమైన ఆస్పత్రుల భవనాలను వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. భవనాలు పూర్తయి సంవత్సరం అవుతున్నా ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు. సౌకర్యాలు లేక ఇక్కడ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వైద్యులు ఆపరేషన్లు చేయలేకపోతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే వీటిపై దృష్టి పెట్టి ప్రారంభించాలని తెలిపారు.
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నూతన భవనాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఆర్ఐ (MRI) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మంచి నీళ్లు, ఇతర కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. కంది ప్రభుత్వాసుపత్రిని అప్గ్రేడ్ చేసి ఎమర్జెన్సీ సెంటర్ ను ఏర్పాటు చేయాలని అన్నారు.
జిల్లావ్యాప్తంగా పీహెచ్సీ (PHC) కేంద్రాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సూదులు, మందులు కొరత లేకుండా చూడాలని అన్నారు. జహీరాబాద్లో ఖాళీగా ఉన్న 30 డాక్టర్ పోస్టులను, 40 సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు.
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేదలకు కనీస సౌకర్యాలు కల్పించాలని, మందులు సరఫరా చేయాలని అన్నారు. ఆసుపత్రిలోని సమస్యలు పరిష్కారం చేయకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్ సాయిలు, నర్సిములు, నాయకులు కృష్ణ, అశోక్, వాజీద్ అలీ, బాబురావు తదితరులు పాల్గొన్నారు.











