కామారెడ్డి, జూలై 8
కామారెడ్డి జిల్లా భరోసా కేంద్రం మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల బాధితులకు సత్వర న్యాయం, రక్షణ, పునరావాసం కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తోందని జిల్లా కలెక్టర్ అశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర తెలిపారు. బుధవారం వారు కేంద్రాన్ని సందర్శించి బాధితులకు అందుతున్న సేవలు, కేసుల పురోగతి, వివిధ శాఖల సమన్వయం, పునరావాస చర్యలపై సమీక్షించారు.
మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల బాధితులకు సత్వర న్యాయం, రక్షణ, పునరావాసం కల్పించడంలో జిల్లా భరోసా కేంద్రం కీలక పాత్ర పోషిస్తోందని జిల్లా కలెక్టర్ అశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర తెలిపారు. బుధవారం వారు సంయుక్తంగా కామారెడ్డి జిల్లా భరోసా కేంద్రాన్ని సందర్శించి బాధితులకు అందుతున్న సేవలు, నమోదైన కేసుల పురోగతి, వివిధ శాఖల సమన్వయం, పునరావాస చర్యలు, కౌన్సెలింగ్, న్యాయ, వైద్య సేవలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భరోసా కేంద్రానికి వచ్చే ప్రతి బాధితురాలికి ఒకే వేదికపై వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించడం అన్ని శాఖల బాధ్యత అని అన్నారు. పోలీసు, వైద్య, మహిళా–శిశు సంక్షేమ, న్యాయ శాఖలు సమన్వయంతో పనిచేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ బాధితులతో సిబ్బంది సానుభూతితో, మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని, వైద్య సేవలు, మానసిక కౌన్సెలింగ్, ఉచిత న్యాయ సహాయం, పోలీసు సహాయం, పునరావాస సేవలు ఎలాంటి జాప్యం లేకుండా అందేలా చూడాలని ఆదేశించారు. మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయడంతో పాటు వారి వ్యక్తిగత వివరాల గోప్యతను కచ్చితంగా పరిరక్షించాలని స్పష్టం చేశారు. అనంతరం భరోసా కేంద్రంలోని కౌన్సెలింగ్ గదులు, లీగల్ సెల్, మెడికల్ ఎయిడ్ విభాగం, రికార్డు నిర్వహణను పరిశీలించి సేవల నాణ్యత మెరుగుపర్చేందుకు పలు సూచనలు చేశారు.











