తెలంగాణలో మాదిగల జనాభాకు అనుగుణంగా 10 నుంచి 11 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్ మాదిగ డిమాండ్ చేశారు. కుల గణన నివేదికలో మాదిగల జనాభా 10.3 శాతంగా వెల్లడైన నేపథ్యంలో, ఎస్సీ వర్గీకరణలో అదే మేరకు వాటా కల్పించాలని ఆయన కోరారు.
నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కనక ప్రమోద్ మాదిగ మాట్లాడుతూ, మాదిగలు రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన వర్గమని, గత కొన్నేళ్లుగా మంద కృష్ణ మాదిగ చేస్తున్న వ్యాఖ్యలు కుల గణన నివేదికతో నిజమయ్యాయని అన్నారు. అయినప్పటికీ, గతంలో 9 శాతం రిజర్వేషన్లను నిర్ణయించడం వల్ల మాదిగలకు అన్యాయం జరిగిందని విమర్శించారు.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ వైఖరిలో మార్పు తీసుకువచ్చి, మాదిగలకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. జనాభా శాతానికి తగ్గ రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్న సమయంలో కొంతమంది 9 శాతం రిజర్వేషన్లను సమర్థించడం బాధాకరమని ఆయన అభిప్రాయపడ్డారు.
కుల గణన నివేదిక ప్రకారం మాదిగలు కేవలం జనాభాలోనే కాకుండా, దినసరి కూలీ పనులు చేసేవారిలో, భూమిలేని నిరుపేదలలో కూడా అధికంగా ఉన్నారని తెలిపారు. ఇది వారి సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనాన్ని స్పష్టంగా సూచిస్తుందని అన్నారు. మాదిగల పేదరికాన్ని తొలగించేందుకు ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ప్రభుత్వ భూములను పంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే, అన్ని రకాల ప్రభుత్వ నియామకాల్లో మాదిగలకు 11 శాతం వాటా కేటాయించాలని కోరారు.












