ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఇతర ప్రాజెక్టుల భూసేకరణను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, శాసనసభ్యులతో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సమావేశమై, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కీలక సూచనలు చేశారు. ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, అలాగే జిల్లాలోని ఇతర ప్రాజెక్టుల విషయంలోనూ భూసేకరణను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ప్రాజెక్టుల భూసేకరణ నిధుల విషయంలో ఎటువంటి జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు తెలిపారు. పెండింగ్ బిల్లులను చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అధికారులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. నిధుల లభ్యతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. నిర్మాణంలో ఎదురయ్యే అడ్డంకులను సకాలంలో గుర్తించి, వాటిని అధిగమించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, జి. మధుసూదన్ రెడ్డి, టి. మేఘా రెడ్డి, కె. రాజేశ్ రెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకరయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.











