మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితో తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తెలిపారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన మహానేత విగ్రహానికి నివాళులర్పించి, ఆయన సేవలను స్మరించుకున్నారు.
రాజీవ్ గాంధీ 21వ శతాబ్దంలో దేశాన్ని కంప్యూటర్ యుగం వైపు నడిపించి, యువతను సాంకేతిక రంగంలో సన్నద్ధం చేసిన గొప్ప నాయకుడని ముఖ్యమంత్రి కొనియాడారు.
దేశ సమగ్రత కోసం ప్రాణాలర్పించిన రాజీవ్ గాంధీ, టెలికాం, కంప్యూటర్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే కాకుండా, స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు కల్పించి పరిపాలనలో వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించారని ఆయన అన్నారు.
లోక్సభ, శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లును త్వరితగతిన ప్రవేశపెట్టాలని ప్రధానమంత్రిని కోరారు. తెలంగాణ ఏర్పాటులో సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ప్రశంసించారు.










