రైతు భరోసా ఎవరికి వస్తుందంటే..! విధివిధానాల రూపకల్పనలో అధికారులు..!!_*
రైతు భరోసా । నూతన సంవత్సరంలో రైతు భరోసాను అమలు చేయాలని నిర్ణయించిన సర్కారు విధివిధానాల రూపకల్పనపై దృష్టి పెట్టింది. రైతు భరోసాను బీఆరెస్ ప్రభుత్వం ఎలాంటి పరిమితి లేకుండా భూమిఉన్నరైతులందరికీరైతుబంధుఅందించింది.కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అర్హులైన రైతులకు, సాగు భూములకు మాత్రమే ఇవ్వాలని భావిస్తోంది. ఈ మేరకు పలుసార్లు సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు కూడా స్టేట్ మెంట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. బీడు భూములకు, సాగులో లేని భూములకు, లే అవుట్లకు కూడా గతంలో రైతు బంధు ఇచ్చి ప్రజాధనాన్ని వృథా చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. తాజాగా ఇలాంటి దుబారాకు తావు లేకుండా, సాగు చేస్తున్న భూమికి, సాగు చేస్తున్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని మంత్రులు ప్రకటిస్తున్నారు. రైతు భరోసా భూ స్వాములకు కూడా సన్న, చిన్న, మధ్య తరగతి రైతులకు మాత్రమే అందించాలన్న నిర్ణయానికి రేవంత్ సర్కారు వచ్చింది. ఇందులో భాగంగానే రైతులకు సీలింగ్ విధించే అంశంపై సమాలోచనలు చేస్తున్నది. రైతు భరోసాను 5 ఎకరాలకు పరిమితం చేయాలా? లేక 10 ఎకరాల వరకు అందించ వచ్చునా అనే అంశంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులతోపాటు మండల, జిల్లా స్థాయి నేతల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో ఐటీ చెల్లింపు దారులు ఉంటే.. వారికి సైతం మినహాయించాలా? అనే విషయంలోనూ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది.రైతు భరోసా నుంచి భూస్వాములను, కంపెనీలకు చెందిన భూములను కూడా మినహాయించాలన్న నిర్ణయానికి సర్కారు వచ్చిందని సమాచారం. వందల ఎకరాల భూములున్న భూస్వాములకు సర్కారు పెట్టుబడి సాయం అందించాల్సిన అవసరం లేదని రేవంత్ సర్కారు భావిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఎకరం భూమి ముప్పై లక్ష్లల రూపాయల వరకు ధర పలుకుతున్న నేపథ్యంలో పెద్ద రైతులు, భూస్వాములు తమ భూములు సాగు చేయడానికి పెట్టుబడి పెట్టుకునే శక్తి ఉంటుందని, అలాంటి వారికి రైతు భరోసా అవసరం లేదని అంటున్నది. భూమి సాగుకు పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేక ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే వారికి మాత్రమే సహకారం అందించాలన్న నిర్ణయంతో రేవంత్ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. అలా పేద రైతులకు పెట్టుబడి సహాయం అందించడం ద్వారా వారిని ప్రై వేట్ వడ్డీ వ్యాపారుల అధిక వడ్డీల భారీ నుంచి తప్పించ వచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు రైతు భరోసాను 10 ఎకరాలకు పరిమితం చేయాలన్న నిర్ణయంతో రేవంత్ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. 10 ఎకరాల భూములున్న రైతులు స్వయంగా వ్యవసాయం చేసుకుంటారన్న నమ్మకంతో సర్కారు ఉన్నది.అలాగే కౌలు రైతులకు న్యాయం చేయాలన్న ఆలోచనలో ఉన్న రేవంత్ సర్కారు ఆ దిశగా సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కౌలు రైతులను ఏవిధంగా గుర్తించాలన్న దానిపైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు లేదు. అయితే ఇటీవల మంత్రులు పలు చోట్ల మాట్లాడుతూ సాగు చేసుకునే రైతులకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని ప్రకటనలు చేయడం గమనార్హం. కానీ కౌలు రైతులకు సంబంధించి ఇప్పటి మరకు ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో నిజంగా తెలంగాణలో కౌలు రైతులకు రైతు భరోసా వస్తుందా? లేదా? అన్నది సస్పెన్స్ గా మారింది. కాగా ఈనెల 30వ తేదీన జరిగే మంత్రి వర్గ సమావేశంలో రైతు భరోసాపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.