తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పెరిగిన వేతనాలు జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు.
రాష్ట్రంలోని సుమారు 1.11 కోట్ల మంది కార్మికులకు ప్రయోజనం చేకూర్చేలా ఈ నిర్ణయం తీసుకోబడింది. ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కార్మిక ఉపాధి శిక్షణ శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిసి మీడియా సమావేశంలో ఈ శుభవార్తను వెల్లడించారు.
కార్మికులను నాలుగు కేటగిరీలుగా (అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్) విభజించి, వేతనాలను పెంచినట్లు తెలిపారు. గతంలో ఉన్న రెండు జోన్లను (అర్బన్, రూరల్) ఇప్పుడు మూడు జోన్లుగా (మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాలు) విస్తరించారు. ఈ జోన్ల వారీగా కనీస వేతనాలు నిర్ణయించారు.
ముఖ్యమంత్రి తెలిపిన వివరాల ప్రకారం, జోన్-1లో అన్స్కిల్డ్ కార్మికుల వేతనం ₹12,750 నుంచి ₹16,000కు, సెమీ స్కిల్డ్ కార్మికుల వేతనం ₹13,592 నుంచి ₹17,000కు, స్కిల్డ్ కార్మికుల వేతనం ₹13,772 నుంచి ₹18,500కు, హైలీ స్కిల్డ్ కార్మికుల వేతనం ₹14,607 నుంచి ₹20,000కు పెరిగింది. ద్రవ్యోల్బణం, నిత్యవసరాల ధరల పెరుగుదల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
గత ప్రభుత్వం కార్మికుల వేతనాల పెంపుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే ఈ వేతన సవరణ జరిగిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కార్మిక సంఘాలు, యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విదేశాలకు వెళ్లే కార్మికులకు శిక్షణ, ఇతర ఏర్పాట్లు చేస్తామని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.










