రంగులు మాయం.. దుప్పట్లూ దూరం..!!

*రంగులు మాయం.. దుప్పట్లూ దూరం..!!*

రోజుకో రంగు బెడ్‌షీట్‌ ఊసే లేదాయేదవాఖానాకు వెళ్తే.. వణుకే

*హైదరాబాద్‌ గాంధీఆసుపత్రి*

ఈ ఫొటో చూశారా.. గాంధీ ఆసుపత్రి మూడో అంతస్తులోని జనరల్‌ మెడిసిన్‌ వార్డు.

మలేరియా, డెంగీ, చికున్‌గన్యా జ్వరాలతోపాటు ఇతర రోగులతో ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. ఇందులో 20కి పైగా మంచాలు ఉండగా.. ఒక్కదానిపై కూడా బెడ్‌షీట్‌ లేకపోవడం రోగుల దుస్థితికి అద్దం పడుతోంది. కొన్ని రోజులుగా మంచంపై దుప్పటి పరిచే నాథుడే కన్పించడం లేదు. కొందరు సొంతంగా దుప్పట్లు తెచ్చుకుంటున్నారు. లేని వాళ్లు బయట దుకాణాల్లో కొనుక్కొంటున్నారు. కొనుక్కోలేని వారు చలికి వణుకుతూ దోమలతో సహవాసం చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు దుప్పట్లు సరఫరా చేస్తే…వాటితో నెట్టికొస్తున్నారు.

*గొప్పగా చెప్పి.. వేయడమే మరిచి*

సర్కారు దవాఖానాల్లో గతంలో రోజుకో రంగు బెడ్‌షీట్‌ ప్రవేశపెడుతున్నట్లు అప్పట్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఘనంగా చెప్పుకొచ్చారు. కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాల ప్రకారం నిబంధనల్లో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. అందుకు అనుగుణంగా తొలి విడతగా తెలుపు, గులాబీ, ఊదా రంగుల బెడ్‌షీట్‌లను ప్రవేశపెట్టారు. గతంలో తెలుపు రంగు బెడ్‌షీట్లు మాత్రమే ఉండేవి. బదులుగా రోజూ ఒక రంగు వాడటం వల్ల తరచూ పడకలపై దుప్పట్లు మార్చడంతోపాటు ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడే వీలు ఉంటుంది. ఈ ఉద్దేశంతోనే రంగుల బెడ్‌షీట్ల విధానం తెరపైకి తెచ్చారు. ఏడాది వరకు గాంధీ, ఉస్మానియా ఇతర ఆసుపత్రుల్లో ఈ రంగుల బెడ్‌షీట్లు దర్శనమిచ్చాయి. తర్వాత మెల్లగా ఇవి కనుమరుగై మళ్లీ తెలుపు రంగువే దర్శనమిచ్చాయి. ప్రస్తుతం వాటికి కూడా దిక్కులేదని రోగులు వాపోతున్నారు. గాంధీ ఆసుపత్రిలోని పలు వార్డుల్లో అసలు పడకలపై దుప్పట్లే వేయడం లేదని చెబుతున్నారు. పరుపులు సైతం చిరిగి పోవడంతో ఇబ్బందిగా ఉంటోంది.ఉస్మానియాలో దుప్పట్లు ఉన్నా…2-3 రోజులకొకసారి మార్చుతున్నారు. దుప్పటి మార్చాలంటే సిబ్బంది చేయి తడపాల్సి వస్తోందని రోగులు చెబుతున్నారు.

*చలి..ఇన్‌ఫెక్షన్ల వ్యాప్తి…*

చలి తీవ్రత పెరిగింది. గాంధీ ఆసుపత్రిలో 1500, ఉస్మానియాలో 1169 వరకు పడకలు అందుబాటులో ఉన్నాయి. అంతకుమించి రోగులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో పడకలపై దుప్పట్ల కొరత వేధిస్తోది. ఉతుక్కునే అవకాశం లేకపోవడంతో రోజుల తరబడి అవే వినియోగించడం వల్ల ఇన్‌ఫెక్షన్ల వ్యాప్తి పెరిగి ఇతరులకు సోకే ప్రమాదం ఉందని అంటున్నారు. వాస్తవానికి నిత్యం పడకలపై దుప్పటి, తలగడ కవర్లు మార్చాలి. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

Join WhatsApp

Join Now